TS News: మెట్రో గట్టెక్కేదెలా?.. ఎల్‌అండ్‌టీ అధికారులతో మంత్రుల బృందం భేటీ

ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైల్‌కు సంబంధించిన సమస్యల

Updated : 13 May 2022 11:49 IST

హైదరాబాద్‌: ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైల్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన కమిటీ గురువారం బీఆర్కే భవన్‌లో సమావేశమైంది. మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పురపాలక, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్విద్‌ కుమార్‌, రామకృష్ణారావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, మెట్రో రైల్‌ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రస్తావించిన సమస్యలపై సమావేశంలో చర్చించారు. కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడంతో మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిందని, భారీగా నష్టం వస్తోందని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు గతంలో సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోయిందని, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని వివరించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ లేవనెత్తుతున్న సమస్యలు, కోరుతున్న పరిష్కారాలు, వాటి ప్రభావం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో మరోమారు సమావేశమై అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలని అధికారులకు మంత్రులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని