Gulab cyclone: తీరాన్ని తాకిన గులాబ్‌ తుపాను.. బలమైన గాలులకు అవకాశం: ఐఎండీ

గులాబ్‌ తుపాను ఫ్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం మొదలైంది. తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ శ్రీకేస్ లాఠక్‌ ఆదేశించారు....

Updated : 26 Sep 2021 19:49 IST

శ్రీకాకుళం: గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. తుపాను తీరం దాటే వేళలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

పునరావాస కేంద్రాలకు 182 మంది

గులాబ్‌ తుపాను ఫ్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం మొదలైంది. తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ శ్రీకేస్ లాఠక్‌ ఆదేశించారు. ఇప్పటికే వజ్రపుకొత్తూరు మండలం పరిధిలో 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. 73 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశామన్నారు. ఫిర్యాదులు, సాయం కోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08942-240557, ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్ నంబర్‌ 6309990933ను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని నరసన్నపేటలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. ప్రధాన వీధుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్ర తీర ప్రాంతాలైన రాజారాంపూరం, గుప్పెడుపేట, గొల్లవానిపేట గ్రామాల్లో తుపాన్‌ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తీర గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. గులాబ్ తుపాను.. శ్రీకాకుళం జిల్లా పలాస, టెక్కలి నియోజకవర్గాల మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. దేవునళ్తాడ, బావనపాడు, మూలపేట వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

తీరప్రాంత ప్రజలకు సమాచారం ఇవ్వాలి..

విశాఖ జిల్లాలో తుపాను హెచ్చరికలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రి కళింగపట్నం - గోపాలపట్నం మధ్య తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందన్నారు. విద్యుత్తు, జీవీఎంసీ, రెవెన్యూ, ఫైర్, పోలీస్‌, ఆర్ అండ్ బీ, మత్యశాఖ అధికారులు, సిబ్బంది అవసరమైన సహాయక సామగ్రితో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీరప్రాంత మండలాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలని.. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కోరారు. 22 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్‌ బృందం గాజువాక పరిధిలో సిద్ధంగా ఉందన్నారు.

విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్‌

తుపాను ప్రభావంతో కలిగే విద్యుత్తు అంతరాయాలపై టోల్ ఫ్రీ నంబర్‌ 1912కి ఫిర్యాదు చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోషరావు సూచించారు. విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు చేపట్టెందుకు సంస్థ డైరెక్టర్లు, ఆపరేషన్స్, ప్లానింగ్, కమర్షియల్, మెటీరియల్ పర్చేజ్‌ విభాగపు అధికారులతో 
సమావేశమయ్యారు. తుపాను ప్రభావానికి తెగిపడే విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, నియంత్రికలను సరిచేసేందుకు యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని