Sircilla: ఎడతెరిపిలేని వర్షం.. జలదిగ్బంధంలో సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాతబస్టాండ్‌, వెంకంపేట, ప్రగతినగర్‌, పెద్దబజార్‌, కరీంనగర్‌ రోడ్డు, శాంతినగర్‌ ప్రాంతాలు

Updated : 07 Sep 2021 12:44 IST

సిరిసిల్ల పట్టణం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాతబస్టాండ్‌, వెంకంపేట, ప్రగతినగర్‌, పెద్దబజార్‌, కరీంనగర్‌ రోడ్డు, శాంతినగర్‌ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పట్టణంలో అమ్మకాల కోసం ఉంచిన పలు వినాయక విగ్రహాలు వరదలో కొట్టుకెళ్లాయి. వరదనీటిలో కొట్టుకొచ్చిన ఓ వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదకరంగా బోనాల చెరువు.. భయాందోళనలో స్థానికులు

సిరిసిల్ల సమీపంలో ఉన్న బోనాల చెరువు ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలోనైనా చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కలెక్టరేట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆధ్వర్యంలో సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సిరిసిల్లలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబరు 91000 69040కు ఫోన్‌చేసి అవసరమైన సహాయం పొందొచ్చని చెప్పారు.

పరీక్షలు వాయిదా వేసిన శాతవాహన వర్సిటీ

రాష్ట్రవాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శాతవాహన వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.


 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని