
Heavy Rains: పుదుచ్చేరి- చెన్నై మధ్య తీరందాటిన వాయుగుండం..
ఆ మూడు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: కమిషనర్ కన్నబాబు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటించారు. ఈ ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. సహాయ చర్యలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు కన్నబాబు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రమాదకరంగా పింఛ, అన్నమయ్య ప్రాజెక్టు జలాశయాలు
కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సుండుపల్లి సమీపంలోని పింఛ, రాజంపేట వద్ద ఉన్న అన్నమయ్య జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పింఛ ప్రాజెక్టు మట్టికట్ట 3 మీటర్ల మేర కోతకు గురైంది. పింఛ నుంచి అన్నమయ్య జలాశయానికి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 1.5లక్షల క్యూసెక్కుల నీటికి దిగువకు విడిచిపెడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.