AP News: నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు: హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. డ్రోన్‌ వీడియో

నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి. 

Updated : 30 Nov 2021 11:06 IST

​​

నెల్లూరు: నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ ఉదయం గూడూరు- మనుబోలు మధ్య పంబలేరు వరద ప్రవాహంతో 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన డ్రోన్‌ విజువల్స్‌ అక్కడి వరద పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. మరోవైపు కండలేరు డ్యామ్‌ నుంచి వరద పోటెత్తడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు చెరువు నిండుకుండలా మారి రోడ్డుపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మర్రిపాడు మండలం‌ పి.నాయుడు పల్లి, చుంచులూరు గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. చుంచులూరు వద్ద కేత మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రెండు రోజులుగా ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 500 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రెండు గ్రామాలపైన ఉన్న చెరువులు ప్రమాదకర స్థాయిలో నీటితో నిండి ఉండటంతో ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాయుడుపేటలో భారీ వర్షాల కారణంగా పంటల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో అవి ఎప్పుడు కూలిపోతాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పశువులు మేత కోసం అలమటిస్తున్నాయని.. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమశిలకు భారీగా వరద.. 

భారీ వర్షాల కారణంగా సోమశిల జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 96,569 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,15,396క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 77.98టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 68.37టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు