TS News: శ్రీరాంసాగర్‌ 8 గేట్లు ఎత్తివేత

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి

Updated : 22 Jul 2021 16:36 IST

నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలంలో 23.65 సె.మీ వర్షం కురిసింది. శ్రీరాంసాగర్‌ జలాశయానికి(ఎస్సార్‌ఎస్పీ) భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,88,325 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 81.696 టీఎంసీలుగా ఉంది. ఎస్సార్‌ఎస్పీ 8 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నిర్మల్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు జలాశయాలు పూర్తిగా నిండాయి. కడెం నారాయణ రెడ్డి జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 7.603 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.586 టీఎంసీలకు చేరింది. సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.647టీఎంసీలకు చేరింది.

సూర్యాపేట జిల్లాలోని మూసీ జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3,369 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 9,072 క్యూసెక్కులుగా ఉంది. దీని గరిష్ఠ నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.

హైదరాబాద్‌ శివార్లలో వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండగా.. పెద్ద ఎత్తున వరద చేరుతోంది. ఉస్మాన్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ఉదయం 9 గంటల వరకు నీటిమట్టం 1784.9 అడుగులకు చేరింది. హిమాయత్‌సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.6 అడుగుల వద్ద నీరు ఉంది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని