Corona Virus: కొవిడ్‌తో మెదడుకు అధిక ముప్పు

కొవిడ్‌ కారణంగా మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఇప్పటికీ పూర్తిగా అంతుచిక్కని విషయమే!

Published : 27 Oct 2021 12:12 IST

లండన్‌: కొవిడ్‌ కారణంగా మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఇప్పటికీ పూర్తిగా అంతుచిక్కని విషయమే! అయితే- కరోనా కారణంగా కొందరు బాధితుల్లో అరుదైన నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి. వైరస్‌కు విరుగుడుగా పరిశోధకులు అభివృద్ధి చేసిన టీకాలతోనూ ఇలాంటి దుష్ప్రభావాలే ఉంటున్నట్టు నిపుణులు తేల్చారు. దీంతో ఈ అంశంపై ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన 3.2 కోట్ల మంది ఆరోగ్య వివరాలను సమీక్షించారు. కరోనా సోకిన తర్వాత 28 రోజుల్లో, లేదా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్న తర్వాత 28 రోజుల్లో ఎలాంటి నాడీ సంబంధ సమస్యలు తలెత్తాయన్నది వారు విశ్లేషించారు. ‘‘ఆస్ట్రాజెనికా/కొవిషీల్డ్‌ టీకా తొలిడోసు తీసుకున్నవారిలో కొందరికి పక్షవాతం, మెదడులో రక్తస్రావం ముప్పు స్వల్పంగా ఉంటోంది. వ్యాక్సిన్‌ తీసుకున్న 10 వేల మందిలో సగటున ఒకరు, లేదా అంతకంటే తక్కువ మందిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. టీకా దుష్ప్రభావాలతో పోలిస్తే... కొవిడ్‌ కారణంగానే నాడీ సంబంధ సమస్యలు తీవ్రంగా ఉంటున్నట్టు గుర్తించాం’’ అని పరిశోధనకర్త కరోల్‌ కూప్లాండ్‌ పేర్కొన్నారు. నేచర్‌ మెడిసిన్‌ పత్రిక ఇందుకు సంబంధించిన వివరాలను అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని