Ts News: పాస్‌పోర్టుల జారీపై సికింద్రాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం కీలక నిర్ణయం

కొవిడ్‌ పరిస్థితులు చాలా వరకు మెరుగవడంతో పాస్‌పోర్టు జారీకి వంద శాతం అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం నిర్ణయించింది

Updated : 23 Sep 2021 20:06 IST

హైదరాబాద్: కొవిడ్‌ పరిస్థితులు చాలా వరకు మెరుగవడంతో పాస్‌పోర్టుల జారీకి వంద శాతం అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం నిర్ణయించింది. కొవిడ్‌ నిబంధనలతో ప్రస్తుతం పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లకు 7 నుంచి 12 రోజులు సమయం పడుతోంది. అపాయింట్‌మెంట్లు ఆలస్యం అవుతుండటంతో దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌ రూపంలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య స్పందించారు. తాజా పరిస్థితులను అధికారులతో సమీక్షించిన అనంతరం వందశాతం అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, 14 తపాలా సేవా కేంద్రాల్లో వందశాతం అపాయింట్‌మెంట్లు ఇచ్చే విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని బాలయ్య వెల్లడించారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని