Hyderabad News: సైబర్‌ క్రైం అరికట్టేందుకు చర్యలు: సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌(సీపీ)గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఉండి అవినీతి నిరోధకశాఖ డీజీగా

Updated : 25 Dec 2021 16:04 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌(సీపీ)గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఉండి అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ అయిన అంజనీకుమార్‌ సీవీ ఆనంద్‌కు ఈ సందర్భంగా బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీవీ ఆనంద్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ సీపీగా నియమించిన సీఎంకు కృతజ్ఞతలు. హైదరాబాద్‌ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్దనగరానికి సీపీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది. భిన్న మతాల సమ్మేళనం హైదరాబాద్‌ సొంతం. పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి.

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఎన్నో ఏళ్లు పని చేశా. నగరంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తాం. సైబర్‌ క్రైంను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్‌ కట్టడికి ఇప్పటికే డ్రైవ్‌ నడుస్తో్ంది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరిగేలా చర్యలు తీసుకుంటాం’’ అని సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

ఏసీబీ విజిలెన్స్‌ డీజీగా అంజనీ కుమార్‌ బాధ్యతలు..

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విజిలెన్స్‌ డీజీగా అంజనీకుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. డీజీ గోవింద్‌ సింగ్‌ అంజనీకుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఏసీబీ డీజీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు నా కృతజ్ఞతలు. హైదరాబాద్ సీపీగా మూడున్నరేళ్లకుపైగా విధులు నిర్వహించాను. ఈ సమయంలో అసెంబ్లీ, ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూశాం. కరోనా మొదటి, రెండో దశలో సైతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో సహకరించారు. వారి సహకారంతో శాంతిభద్రతల నిర్వహణ సులువైంది’’ అని అంజనీ కుమార్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని