
రూ.1500 కోట్లు మోసం చేసిన ఇండస్ వివా వ్యవస్థాపకులు అరెస్టు
హైదరాబాద్: నిధులు దారి మళ్లించిన కేసులో ఇండస్ వివా వ్యవస్థాపకులు అంజారంద్, అభిలాష్‌లను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఈడీ కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం నిందితులిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. గొలుసుకట్టు విధానంలో అమాయకులను ఇండస్ వివా కంపెనీ మోసం చేస్తోందని గచ్చిబౌలి పీఎస్‌లో 9 నెలల క్రితం కేసు నమోదైంది. ఈకేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కొందరు ఇండస్ వివా ప్రతినిధులను అరెస్టు చేశారు.
నిధులు దారి మళ్లించినట్టు తేలడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గొలుసుకట్టు విధానంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఇండస్ వివా ప్రతినిధులు దాదాపు 10లక్షల మంది సభ్యులను చేర్చుకొని, వారి నుంచి రూ.1500 కోట్లు వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. పిరమిడ్ విధానంలో కొత్త సభ్యులను చేర్చుకుంటూ పోతే కమీషన్ ఇస్తామని ఇండస్ వివా ప్రతినిధులు అమాయకులను ఆకర్షించారు. సభ్యత్వ రుసుము కట్టి చేరితే కంపెనీకి చెందిన ఉత్పత్తులను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టేవారు. సాధారణ ఉత్పత్తులకు సైతం అధిక ధరలు నిర్ధారించి అమ్మితే కమిషన్ ఇచ్చే వాళ్లని ఈడీ అధికారులు తెలిపారు. ఇలా వసూలు చేసిన డబ్బులను కంపెనీ ఖాతాలో జమచేసి, ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడంతో పాటు ఆ డబ్బులతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. నిధుల మళ్లింపు కేసులో ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అంజారంద్ తో పాటు అభిలాష్ ను అరెస్ట్ చేశామని, కేసులో మరిన్ని అంశాలపై దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.