Ts News: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన

తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే...

Published : 18 Dec 2021 01:02 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఏప్రిల్‌ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయోచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు. పరీక్షల్లో సిలబస్‌ 70శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్‌ పెంచామని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ ఏడాది 11 శాతం తగ్గింది. ఇంటర్‌ తొలి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు గురువారం వెల్లడించింది. మొత్తం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌... రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం సమానంగా రావడం గమనార్హం.

ఫెయిల్‌ అయిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్‌ అయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కమలాపూర్‌ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిది. దీంతో మనస్తాపంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పాఠశాల సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విద్యార్థినిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని