AP EAPCET: 25న ఇంజినీరింగ్‌, సెప్టెంబర్‌ 7న అగ్రికల్చర్‌-ఫార్మసీ కీ విడుదల: ఆదిమూలపు సురేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్‌టీయూకు విద్యా శాఖ

Updated : 17 Aug 2021 17:58 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్‌టీయూకు విద్యా శాఖ అప్పగించింది. జూన్‌ 25న ఏపీఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల నమోదు పక్రియను జూన్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించింది. ఇంజినీరింగ్ పరీక్షను ఈనెల 19, 20, 23, 24, 25 తేదీల్లో... అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను  సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. మౌలిక సదుపాయాల అందుబాటు, కొవిడ్-19 మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలను 16 సెషన్లలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 10 సెషన్లు ఇంజినీరింగ్.. ఆరు సెషన్లు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ పరీక్ష రద్దు చేసిననందున ఈఏపీసెట్‌ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఈఏపీసెట్‌-2021 పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజినీరింగ్, 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటినీ ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 14 పరీక్షా జోన్లలో 120 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తును సమర్పించేటప్పుడు వచ్చిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం మొత్తం 3,650 మంది విద్యార్థులు హెల్ప్ లైన్ సెంటర్‌లో నమోదు చేసుకోగా వారి దరఖాస్తులు సరిదిద్దారు. కొవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 25న ఇంజినీరింగ్‌, సెప్టెంబర్‌ 7న అగ్రికల్చర్‌-ఫార్మసీ కీ విడుదల చేయనున్నట్లు ఆదిమూలపు సురేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని