Johnson & Johnson: బూస్టర్‌ డోసుతో విస్తృత యాంటీబాడీలు..!

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోసు టీకా ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది. ఇదే సమయంలో బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు విస్తృత స్థాయిలో పెరుగుతున్నాయని పరిశోధకులు

Updated : 17 Oct 2022 11:27 IST

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోసు టీకా ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది. ఇదే సమయంలో బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు విస్తృత స్థాయిలో పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవడం వల్ల దాదాపు 9రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద ఈ వ్యాక్సిన్‌ అనుమతి పొందిన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ వాటి వల్ల పొందే యాంటీబాడీలు కొన్ని నెలల తర్వాత క్షీణిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ ఆస్పత్రిలో చేరికలు, మరణాలను నిర్మూలించడంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో కొత్తగా వెలుగు చూస్తోన్న  వైరస్‌ రకాలను ఎదుర్కొనేందుకు బూస్టర్‌ డోసు తప్పనిసరి కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై ఇప్పటికే అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 18 నుంచి 55ఏళ్ల వయసు మధ్యవారితో పాటు 65ఏళ్ల పైబడినవారిలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీల స్థాయి మరింత పెరుగుతున్నట్లు తేలింది.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ నుంచి మరింత రక్షణ కల్పించేందుకు బూస్టర్‌ డోసు అందించాలని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సెప్టెంబర్‌ నెల నుంచి వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బూస్టర్‌ డోసుతో యాంటీబాడీల్లో వృద్ధి ఉంటున్నట్లు వెల్లడైంది. దీంతో ఈ టీకా బూస్టర్‌ డోసుకు అనుమతి కోసం అమెరికా, యూరప్‌ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని జన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని