KRMB: తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే మేం అప్పగిస్తాం: ఏపీ

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది

Updated : 14 Oct 2021 19:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది. అయితే, తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమంటూనే ఏపీ సర్కారు.. తెలంగాణ అప్పగిస్తేనే తాము అప్పగిస్తామని మెలిక పెట్టింది.

షరతులు అంగీకరిస్తే ఇవాళ్టి నుంచి ఓకే: ఏపీ ప్రభుత్వం 

రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డులు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కూడా వారి ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేయాలని ఇందులో షరతు పెట్టింది. తెలంగాణ స్వాధీనం చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌ వే, రివర్స్‌ స్లూయిస్‌, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలను అప్పగించేందుకు సిద్ధమని తెలిపింది. షరతులకు అంగీకరిస్తే ఇవాళ్టి నుంచే ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరిస్తున్నట్టు ఏపీ పేర్కొంది. ఏపీ ప్రాజెక్టులతో అక్కడి భవనాలు, ఇతర కట్టడాలు, యంత్ర సామగ్రి ఎక్కడివక్కడ ప్రాతిపదికన అప్పగించేందుకు సిద్ధమంటూ జీవోలో పేర్కొంది. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టును కూడా అధీనంలోకి తీసుకోవాలని కేఆర్‌ఎంబీని కోరింది. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక అధీనంలోకి తీసుకోవాలని కోరింది.

గెజిట్‌ అమలుపై ఉప సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు సహా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణపై అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌ నేతృత్వంలో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్ నేపథ్యంలో సంబంధిత అంశాలు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ, సీడబ్ల్యూసీ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌పై  దృష్టి సారించాలని పేర్కొంది. ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌ను అధ్యయనం చేయాలని పేర్కొంది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదిస్తున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిఫారసులు చేయాలని ఉప సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని