KTR: ఆయిల్ పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి: కేటీఆర్‌

తెలంగాణలో ఆయిల్ పాం వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో ఆయిల్ పాం పరిశ్రమను

Updated : 22 Sep 2021 19:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఆయిల్ పాం వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో ఆయిల్ పాం పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు భారీగా పెరిగిన  నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పాం పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలని కేటీఆర్‌ సూచించారు.

ఆయిల్‌ పాం పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్‌ పాం పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారడంతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆయిల్‌ పాం పంటలకు డిమాండ్‌ ఉన్న మలేషియాలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్‌ పాం సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాల పైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి మంత్రి కేటీఆర్ అంగీకరిస్తూ.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటించి ఆయిల్‌ పాం పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ వెల్లడించారు. ఆయిల్ పాం ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ అభినందించించారు. సిరిసిల్లలో ఆయిల్‌ పాం ఫ్యాక్టరీతో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయిల్ పాం మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను కేటీఆర్ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని