
Lance Naik Saiteja: సాయితేజకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
కురబలకోట: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
ఈ ఉదయం బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్.. వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. సుమారు 30 కి.మీ మేర సాగిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకాలతో ర్యాలీ కొనసాగించారు.
ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న సాయితేజ పార్థివదేహాన్ని చూసి భార్య శ్యామల, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎగువరేగడ మైదానంలో ఉంచిన సాయితేజ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ‘సాయితేజ అమర్ రహే’ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం సాయితేజ వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.