Updated : 08 Dec 2021 10:34 IST

Omicron Variant: ఒమిక్రాన్‌ కలవరం.. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ అవసరమేనా?

నిపుణులేమంటున్నారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వైరస్‌ తాజాగా ‘ఒమిక్రాన్‌’ రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. 30కి పైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరించిన ఈ కొత్త రక్కసి దేశ ప్రజల్ని  ఆందోళనకు గురిచేస్తోంది. డబ్ల్యూహెచ్‌వో దీన్ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా ప్రకటించగా.. కొత్త కేసులు వెలుగుచూస్తున్న ప్రతిసారి జనం ఉలిక్కిపడుతున్నారు. డెల్టా రకంతో పోలిస్తే వ్యాప్తి, రీ-ఇన్ఫెక్షన్‌ విషయంలో ఒమిక్రాన్‌ అనేక రెట్లు వేగవంతమైన లక్షణం కలిగి ఉండటం, వ్యాక్సినేషన్‌ వేయించుకున్నవారికి సైతం సోకుతుండటం దీని కట్టడి కూడా ఓ పెద్ద సవాలే. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందా? బూస్టర్‌ డోసు పంపిణీ చేస్తారా? తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి. వీటిపై పలువురు అంటువ్యాధుల, వైద్య రంగాల నిపుణులేమంటున్నారంటే..

టీకాలే శ్రీరామరక్ష!

ఎలాంటి వేరియంట్‌ నుంచైనా టీకాలే కాపాడతాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్న మాట. వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్నవారికి వైరస్‌ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని, అయితే, రెండు డోసులూ తీసుకుంటే ఇంకా సురక్షితమంటున్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 15శాతం మంది కనీసం ఒక్కడోసు కూడా తీసుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కిచెబుతున్నారు. బూస్టర్‌ డోసులు వేసేందుకు ముందు ఇంకా టీకా వేసుకోని వారిపై దృష్టిసారిస్తే మేలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, దేశంలోని వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలని ది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేసన్‌ (ఐఎంఏ)  కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిపెడితేనే ఈ ప్రమాదకర వేరియంట్‌ ప్రభావం నుంచి తప్పించుకోగలమని.. లేదంటే థర్డ్‌వేవ్‌ను చూడాల్సి రావొచ్చంటూ కేంద్రాన్ని హెచ్చరించింది. ఆఫ్రికన్‌ దేశాల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూశాక.. ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్త వహించడంతో పాటు 12 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి టీకా వేసే ప్రతిపాదనపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.

అడుగు బయటపెడితే మాస్క్‌ ఉండాల్సిందే.. 

టీకా వేయించుకున్నవారు సైతం ఈ మహమ్మారి బారిన పడుతుండం మరో కలవరపెట్టే అంశం. కానీ ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే ఆప్షన్‌ కాదు.. ప్రజల వ్యక్తిగత శుభ్రత, అప్రమత్తత అన్నింటికన్నా ముఖ్యం. అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దు.. ఇంటి నుంచి అడుగు బయటపెడితే మాస్క్‌తోనే వెళ్లడం, భౌతికదూరం పాటించడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వంటి చర్యలతో ఎవరికివారు విధించుకొనే పరిమితులు లాక్‌డౌన్‌ కంటే ఎంతో సురక్షితమైనవని పేర్కొంటున్నారు. 

బాధ్యతతో వ్యవహరిస్తే లాక్‌డౌన్‌తో పనేంటి? 

ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల అనవసర భయాలు అవసరం లేదని, ఈ ముప్పు నుంచి బయటపడాలంటే డబుల్‌ మాస్క్‌ను ధరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థతో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమూ ఎంతో ముఖ్యమని మరికొందరు చెబుతున్నారు. మనం కారు, విమానం, బస్సు ఇతర ఏ వాహనంలోనైనా ప్రయాణించినప్పుడు సామాజిక బాధ్యతని మాత్రం మరవొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కొవిడ్ సోకిన వ్యక్తిని కలిసి వస్తే వెంటనే పరీక్షించుకోవడం.. పాజిటివ్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇలా ప్రతిఒక్కరూ ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరిస్తే లాక్‌డౌన్‌ గానీ, ఎలాంటి ఆంక్షలు గానీ విధించాల్సిన అవసరమే ఉండదని చెబుతున్నారు.

Read latest National - International News and Telugu News


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని