Long Covid: తీవ్ర కొవిడ్‌ మాదిరిగా ప్రాణాంతకం కాదు!

తీవ్ర కొవిడ్‌ మాదిరిగా లాంగ్‌ కొవిడ్‌ ప్రాణాంతకం కాకపోవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Updated : 18 Oct 2021 01:43 IST

ఆరోగ్యరంగ నిపుణుల అంచనా

దిల్లీ: కొవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత కొందరిని దీర్ఘకాలం పాటు కరోనా లక్షణాలు వేధిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. లాంగ్‌ కొవిడ్‌గా పిలిచే ఈ దుష్ర్పభావాలు కొందరిలో 6నెలలపైగా ఉంటున్నట్లు తెలుపులున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర కొవిడ్‌ మాదిరిగా లాంగ్‌ కొవిడ్‌ ప్రాణాంతకం కాకపోవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొన్నిరోజుల తర్వాత అటువంటి బాధితులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని.. కేవలం మధుమేహం, కిడ్నీ వంటి సమస్యలున్న వారిపైనే తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆరోగ్యరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.

తీవ్రత తక్కువే..?

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కొందరు బాధితులు మరోసారి ఆస్పత్రిలో చేరుతున్నట్లు దిల్లీలోని యానివర్సిటీ కాలేజీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఖాన్‌ అమీర్‌ మరూఫ్‌ పేర్కొన్నారు. ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలపాటు కొవిడ్‌ లక్షణాలు వేధిస్తున్నట్లయితే వాటిని పోస్ట్‌ కొవిడ్‌, పోస్ట్‌ అక్యూట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌, క్రానిక్‌ కొవిడ్‌ వంటి పేర్లతో వ్యవహరిస్తున్నాం. అయితే, వీటివల్ల తీవ్ర ప్రభావాలు కలిగే ఆస్కారం తక్కువగానే ఉంటుంది. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిస్తాయి’ అని డాక్టర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. వీటి ప్రభావాలపై మాత్రం మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు.

30శాతం కేసుల్లో లాంగ్‌ కొవిడ్‌..

కొవిడ్‌-19తో పోలిస్తే లాంగ్‌ కొవిడ్‌ అంత ప్రమాదకరమైనదే కాదని కానీ, అంతకుముందే మధుమేహం, కిడ్నీ, క్షయ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిపైనే ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉందని శ్వాసకోస నిపుణులు డాక్టర్‌ శిభు విజయన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ తర్వాత టీబీ కేసుల్లో పెరుగుదల కనిపించిన విషయాన్ని గుర్తు చేశారు. కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిపాలైన వారిలో 30శాతం బాధితుల్లో అలసట, దగ్గు, ఛాతి బరువుగా మారడం, గుండె దడ, కండరాల నొప్పి వంటి (లాంగ్‌ కొవిడ్‌) లక్షణాలు ఉన్నట్లు భారత్‌లో చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని డాక్టర్‌ విజయన్‌ చెప్పారు.

టీకాతో మెరుగైన ఫలితాలు..

లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఉన్నప్పటికీ టీకా తీసుకున్న తర్వాత అవి క్రమంగా తగ్గపోతున్నట్లు గురుగావ్‌లోని పరాస్‌ ఆస్పత్రికి చెందిన శ్వాసకోశ నిపుణులు డాక్టర్‌ అనురేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. టీకా తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా కొవిడ్‌ను ఎదుర్కోవడంతోపాటే లాంగ్‌ కొవిడ్‌ను కూడా నివారించవచ్చని మరో వైద్య నిపుణుడు డాక్టర్‌ మారుఫ్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ (Post Covid Syndrome) లేదా లాంగ్‌ కొవిడ్‌ అనేది వాస్తవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే నిర్ధారించింది. అయితే, ఆ లక్షణాలు ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని తెలిపింది. జబ్బు నుంచి కోలుకున్నప్పటికీ రెండు నెలలకు పైగా లక్షణాలు కొనసాగితే వాటిని లాంగ్‌ కొవిడ్‌గా పరిగణించవచ్చని పేర్కొంది. దీర్ఘ కాలం కొవిడ్‌ ప్రభావాలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక కార్యక్రమాలతో మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ (Syndrome) గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు కృషి చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్యే వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని