Infection Vs Vaccine: ఏ యాంటీబాడీలు ఎక్కువ రోజులు ఉంటాయ్‌..?

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కంటే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

Updated : 28 Jul 2021 01:48 IST

తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..!

లఖ్‌నవూ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఎంతకాలం ఉంటాయనే విషయంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సాధారణంగా వైరస్‌ బారినపడి కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీలు, వ్యాక్సిన్‌ వల్ల వృద్ధి చెందే యాంటీబాడీల్లో ఏవి ఎక్కువ రోజులు రక్షణ కల్పిస్తాయనే దానిపైనా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కంటే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ కాలేజీ జరిపిన అధ్యయనంలో వ్యాక్సిన్‌ల వల్లే మెరుగైన రక్షణ కలుగుతోందని తేలింది.

శరీరంలో కరోనా యాంటీబాడీలు ఎన్నిరోజుల ఉంటాయని తెలుసుకొనేందుకు లఖ్‌నవూలో 2వేల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై అధ్యయనం చేపట్టారు. దీనిలో సాధారణంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కలిగే యాంటీబాడీలు మూడు నుంచి నాలుగు నెలల తర్వాత క్షీణించిపోతున్నట్లు గుర్తించగా.. అదే రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉంటున్నాయని కనుగొన్నారు. 90శాతం వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 68శాతం మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోగా 11శాతం మంది ఒకడోసు తీసుకున్నారు. ఇక మరో 11శాతం వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కనుగొన్నారు. రెండు డోసులు తీసుకున్న 5శాతం మందిలో అసలు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని పరిశోధకులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని