
TS News: పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులదే: హరీశ్‌రావు
హైదరాబాద్: అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా ఇస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలకు వ్యాక్సినేషన్ జరుగుతోందని మంత్రి వివరించారు. తెలంగాణలో 15నుంచి 18ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఇవాళ ప్రారంభమైంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీకాలు వేస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్ పీహెచ్సీలో హరీశ్‌రావు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
‘‘తల్లిదండ్రులంతా పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలి. పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు టీకా వేయించేందుకు కళాశాలల యాజమాన్యాలూ బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదివే పిల్లలందరికీ టీకాలు వేయించాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉంది. 12 కార్పొరేషన్లలో ఆన్లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్నాం. నాలుగు రోజుల తరువాత పరిస్థితుల ఆధారంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటాం. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజీ ఐడీ కార్డ్ ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, సదుపాయాలు ఉన్నాయి. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు. కొవిడ్ టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణ కవచంలా పని చేస్తోంది. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గత వారంలో పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగింది. కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి. వైద్యారోగ్యశాఖ కూడా పూర్తిసాయిలో సన్నద్ధంగా ఉండాలి. ప్రభుత్వం కూడా పూర్తి సంసిద్ధంగా ఉంది’’ అని హరీశ్‌రావు అన్నారు.
మరోవైపు సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ విషయంపై హరీశ్‌రావు స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దానిపై కమిటీ ఏర్పాటు చేశామని.. మధ్యాహ్నానికి నివేదిక వస్తుందన్నారు. ఘటన జరిగినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు చెప్పారు.