Ts News: ఔటర్‌ను తలదన్నేలా రీజినల్‌ రింగ్‌రోడ్డును తీర్చిదిద్దుతాం: కేటీఆర్ 

ఔటర్‌ రింగ్‌రెడ్డును మరిపించేలా ప్రాంతీయ రింగ్‌రోడ్డును నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌...

Published : 17 Dec 2021 01:40 IST

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై విద్యుద్దీపాలను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రెడ్డును మరిపించేలా ప్రాంతీయ రింగ్‌రోడ్డును నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పటాన్‌చెరు ఇంటర్‌ఛేంజ్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై ఎల్ఈడీ విద్యుత్‌ దీపాలను కేటీఆర్‌ ప్రారంభించారు. 2018లో 22 కి.మీ. మేర ఔటర్‌పై విద్యుద్దీపాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మిగిలిన 136 కి.మీ. పరిధిలో రూ.100.22 కోట్లతో చేపట్టిన ఈ ఎల్‌ఈడీ లైట్లను ఇవాళ కేటీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ..‘‘భారతదేశంలో ఏ నగరానికి లేని మణిహారం మనకు 160 కి.మీ. ఔటర్‌ రింగ్‌రోడ్డు రూపంలో ఉంది. మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉంటే సహజంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అయితే ఈ ఔటర్‌ పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా సర్వీస్‌ రోడ్లు, ఇంటర్‌ ఛేంజ్‌ రోడ్లు, ఔటర్‌ రింగ్‌రోడ్డు కలిపి 270.5 కి.మీ. పరిధిలో 9,706 కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి 18,220 ఎల్‌ఈడీ లైట్లను అమర్చాం. ఈ రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏదో విదేశంలో ఉన్నట్లుగా అనిపించేలా విద్యుద్దీపాలను అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇంత గొప్పగా లైట్లను ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏకి నా అభినందనలు. సీఎం కేసీఆర్‌ ఏది తలపెట్టినా.. పెద్దగా ఆలోచిస్తారు. 340 కి.మీ. రీజినల్‌ రింగ్‌రోడ్డును కూడా ఔటర్‌ను తలదన్నేలా అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని