Ap News: గ్రామ సచివాలయాల్లో మరింత విస్తృతంగా సేవలు: పెద్దిరెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

Updated : 29 Sep 2021 19:18 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధార్ సేవలతో సహా అన్ని పౌరసేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి పెద్దిరెడ్డి సచివాలయంలో సమీక్షించారు. సచివాలయ సిబ్బంది వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని.. ఏటా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీ చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం స్థాయిలో పర్యవేక్షిస్తున్న స్పందన కార్యక్రమాన్ని గ్రామ సచివాలయాల స్థాయిలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత మంచి పాలన చేరువ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

బయోమెట్రిక్ విధానం, సచివాలయ సిబ్బందికి యూనిఫారం అందించడం, అన్ని సచివాలయాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచి పౌరసేవలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలయ్యేలా చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. గత ఏడాది జనవరి 26 నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.08 కోట్ల మంది సచివాలయాల్లో తమ విజ్ఞప్తులను అందజేశారని.. వారిలో 3.06 కోట్ల మంది సేవలను పొందారని పేర్కొన్నారు. రైస్ కార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్య శ్రీ, పింఛన్‌ కానుక వంటి పథకాలను సచివాలయాల ద్వారానే పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు పెద్దిరెడ్డి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని