
KTR: వారి ఆహ్వానం.. పెట్టుబడుల ఆకర్షణకు అవకాశంగా భావిస్తాను: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వరకు స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నిర్వహించే వార్షిక సదస్సు-2022కు హాజరుకావాల్సిందిగా డబ్ల్యూఈఎఫ్ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కొవిడ్ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ చూపిన విజన్‌కు గుర్తింపుగా ఆయన్ను ఆహ్వానించినట్లు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. తెలంగాణను సాంకేతిక రంగంలో రారాజుగా కేటీఆర్ నిలిపారని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండె ప్రశంసించారు.
డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు తనను ఆహ్వానించటం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల్లో కనబరుస్తోన్న ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుకూల విధానాలు ప్రపంచ వేదిక వద్ద ప్రస్తావించి గ్లోబల్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక అవకాశంగా మలుచుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.