Updated : 19 Oct 2021 12:47 IST

Vaccine Mixing: వేర్వేరు డోసులతో తగ్గుతోన్న ఇన్‌ఫెక్షన్‌ ముప్పు..!

వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై లాన్సెట్‌ మరో నివేదిక

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి పనితీరుపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న రెండు డోసుల వ్యాక్సిన్‌లను కలిపి తీసుకోవడంపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు డోసుల్లో ఒకే రకమైన టీకా తీసుకోవడంతో పోలిస్తే మిక్స్‌డ్‌ విధానంలో వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అలా వేర్వేరు డోసులు తీసుకోవడం వల్ల వైరస్‌ ముప్పు తగ్గుతున్నట్లు తేలింది. స్వీడన్‌లో చేపట్టిన ఈ అధ్యయన నివేదికను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ యూరప్ విభాగం ప్రచురించింది. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన ప్రయోగాల్లోనూ ఇదే విధమైన ఫలితాలు వచ్చిన విషయ తెలిసిందే.

మిశ్రమ టీకా డోసులను తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలను తెలుసుకునేందుకు స్వీడన్‌కు చెందిన ప్రజారోగ్య విభాగం సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో భాగంగా దాదాపు 7లక్షల మంది పౌరుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సెకండ్‌ డోసు తీసుకున్న తర్వాత రెండున్నర నెలల వరకూ వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఇందులో భాగంగా ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలకు కలిపి తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 67శాతం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇక ఆస్ట్రాజెనెకా, మోడెర్నాలు తీసుకోవడం వల్ల ఈ ముప్పు 79శాతం తగ్గుతోందని కనుగొన్నారు. అదే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం కేవలం 50శాతం మాత్రమే తగ్గుతోందని స్వీడన్‌ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

వెక్టార్‌ ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లను రెండు డోసుల్లో తీసుకోవడం కంటే వెక్టార్‌ ఆధారిత (Astrazeneca) వ్యాక్సిన్‌ను తొలిడోసులో, ఎంఆర్‌ఎన్‌ఏ (Pfizer) సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్‌ను రెండో డోసులో తీసుకోవడం వల్ల వైరస్‌ వల్ల కలిగే ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు స్వీడన్‌లోని ఉమేయా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీటర్‌ నార్డ్‌స్ట్రామ్‌ పేర్కొన్నారు. ప్రమాదకరమైన డెల్డా వేరియంట్‌ను ఎదుర్కోవడంలోనూ ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు.

మిక్సింగ్‌ పద్ధతిలో వ్యాక్సిన్‌ అందించడం వల్ల మెరుగైన ఫలితాలే వస్తున్నప్పటికీ అవి సురక్షితం, సమర్థతపై భారీ స్థాయిలో అధ్యయనాలు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే చెప్పింది. డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లుగానే తాజా అధ్యయనంలో వాస్తవ ఫలితాలు వెలుబడ్డాయని ఉమేయా యూనివర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌ మార్కెల్‌ బాలిన్‌ పేర్కొన్నారు. ఇంతకుముందు వచ్చిన ఫలితాలు కూడా మిక్స్‌డ్‌ విధానంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే,  ఈ ఫలితాలు ఎంతకాలం రక్షణ కలిగిస్తాయనేది మాత్రం తాజా అధ్యయనంలో వెల్లడించలేదు. వీటిపై తదుపరి అధ్యయనాలు కొనసాగుతాయని స్వీడన్‌ నిపుణులు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, రెండు వేర్వేరు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నప్పటికీ.. కేవలం కొన్ని దేశాలు మాత్రమే ప్రయోగాత్మకంగా వీటిని అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ వ్యాక్సిన్‌ మిశ్రమ విధానంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. దీంతో వేర్వేరు టీకాలు తీసుకునే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  ఈ నేపథ్యంలో ఒకే రకమైన వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో తీసుకోవాలని.. సొంతంగా రెండు రకాల డోసులను తీసుకోకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్‌ డోసులను తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని