AP News: ఏపీలో ఎంపీలాడ్స్‌ వివాదం.. వివరణ కోరిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీలాడ్స్‌ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనలకు...

Published : 24 Oct 2021 01:18 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీలాడ్స్‌ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనలకు అనుగుణంగా ఎంపీలాడ్స్‌ నిధులు ఖర్చుచేయకపోవటంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి కేంద్రం లేఖ పంపింది. మతపరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మతుల కోసం ఎంపీలాడ్స్‌ నిధులు కేటాయించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు వివరణ కోరుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ లాడ్స్‌ నిధుల దుర్వినియోగంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు చేసిన ఫిర్యాదు మేరకు ప్రధాని కార్యాలయం స్పందించిందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాస్తున్నట్టు కేంద్ర గణాంకశాఖ పేర్కొంది.

గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ చర్చి నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.86లక్షలు ఖర్చు చేయటం సహా చాలా చోట్ల ఇదే తరహాలో వ్యయం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎంపీ నుంచి వివరణ కోరాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు పీఎంఓ ఆదేశాలు ఇచ్చింది. ఎంపీలాడ్స్‌ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించాల్సిన రాష్ట్ర స్థాయి నోడల్‌ విభాగం, జిల్లా అధికారులు నిబంధనలు పాటించకపోవటాన్ని కేంద్రం ఆ లేఖలో ప్రశ్నించింది. ఎంపీ లాడ్స్‌ మార్గదర్శకాల మేరకు నిధులను మతపరమైన సంస్థలకు వ్యయం చేయరాదని, ఆయా సంస్థలు, గ్రూపులకు చెందిన స్థలాల్లోనూ నిర్మాణం చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఎలాంటి కట్టడాలైనా పునర్మిర్మాణం, మరమ్మతులకు ఎంపీ లాడ్స్‌ వినియోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఎంపీ లాడ్స్‌ నిధుల వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏడాదికి ఒకసారైనా సమావేశం కావాలని కేంద్రం సూచించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అన్ని నోడల్‌ విభాగాలతోనూ  సమావేశం నిర్వహించి దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేసింది. దీంతో పాటు ఎంపీ లాడ్స్‌ నిధులకు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు, పనులు ఉన్నాయా? లేదా? అన్నది జిల్లా యంత్రాంగం సరి చూసుకోవాలని, దీనికి జిల్లా అధికారే బాధ్యులు అవుతారని లేఖలో స్పష్టం చేసింది. ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సమగ్రమైన వాస్తవిక నివేదికతో పాటు, ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై కూడా నివేదిక పంపాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని