
Ts News: వరంగల్‌లో 2వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
హైదరాబాద్: వరంగల్‌లో 2వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్థులతో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టనున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు అందుబాటులో ఉంది. వరంగల్‌లో 215.35 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందులోని 15 ఎకరాల్లో ప్రస్తుతం 24 అంతస్థుల భవనం నిర్మించనున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి
వరంగల్‌లో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట తప్పని, మడమ తిప్పని నేత అని .. ఆయన చెప్పినట్లుగానే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం వరంగల్‌లోనే లభ్యమవుతుందన్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రులపైనా భారం తగ్గుతుందన్నారు. విద్యా, వైద్య పథకాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.