Haryana: కొవిడ్ వేళ.. అంతుపట్టని జ్వరం..!

కరోనా వేళ.. హరియాణాలోని చిల్లి గ్రామాన్ని మిస్టరీ జ్వరం కలవరానికి గురిచేస్తోంది. ఈ అంతుపట్టని జ్వరంతో 10 రోజుల వ్యవధిలో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు సుమారు 44 మంది దీని బారినపడగా.. వారిలో 35 మంది 18 ఏళ్ల వయస్సులోపు వారేనని అధికారులు వెల్లడించారు.

Updated : 16 Sep 2021 02:29 IST

హరియాణా గ్రామంలో 8 మంది చిన్నారులు మృతి

చండీగఢ్‌: కరోనా వేళ.. హరియాణాలోని చిల్లి గ్రామాన్ని మిస్టరీ జ్వరం కలవరానికి గురిచేస్తోంది. ఈ అంతుపట్టని జ్వరంతో 10 రోజుల వ్యవధిలో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ సుమారు 44 మంది దీని బారినపడగా.. వారిలో 35 మంది 18 ఏళ్ల వయస్సులోపు వారేనని అధికారులు వెల్లడించారు. అలాగే బాధితులంతా దగ్గర్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. మరణాలకు గల కారణాన్ని అధికారులు ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ.. డెంగీ కావొచ్చనే అవకాశాన్ని వారు తోసిపుచ్చలేదు. బాధితుల్లో జ్వరం, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడమే అందుకు కారణం. ఈ పరిస్థితుల్లో అధికారులు ఇంటింటికి తిరిగి డెంగీ, మలేరియాతో పాటుగా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. అలాగే పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. 

పిల్లలతో పాటు పెద్దల్లో ఈ జ్వరం కనిపిస్తోందని, గత వారం రోజులుగా బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యాధికారి విజయ్ కుమార్ తెలిపారు. ‘ఇప్పటివరకూ ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందారు. కలుషితమైన నీరు ఈ జ్వరాలకు కారణం కావొచ్చు. 15 నుంచి 20 రోజులుగా ఈ పరిస్థితి నెలకొని ఉంది. వారికి ఇంకా డెంగీ పరీక్షలు చేయలేదు. మా దగ్గర సరైన వైద్య సదుపాయాలు లేవు’ అని చిల్లి సర్పంచ్‌ వెల్లడించారు. ‘ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉందని వారు చెబుతున్నారు. ఆగస్టు 25 నుంచి ఈ పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 11న వైద్య బృందాలు వచ్చాయి. చిన్నారులే ఎక్కువ సంఖ్యలో అనారోగ్యానికి గురవుతున్నారు. మా దగ్గర భయానక వాతావరణం నెలకొని ఉంది’ అంటూ మరో గ్రామస్థుడు ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క వైరల్ ఫివర్ వచ్చినప్పుడు కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుందని వైద్యాధికారులు చెప్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని