Ap News: ‘రాయలసీమ’ను పరిశీలించి నివేదికివ్వండి.. ఎన్జీటీ ఆదేశం

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)

Updated : 23 Jul 2021 14:45 IST

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. గవినోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి నివేదించాలని గతంలో కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఎన్జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని అఫిడవిట్‌లో పేర్కొనగా.. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

మరోవైపు ధిక్కరణ పిటిషన్లపై ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎక్కడా తాము ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించడం లేదని.. కేవలం ప్రాజెక్టు డీపీఆర్‌కు తయారీకి చెందిన అధ్యయనాల పనులు మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం సహకరించనందున స్వయంగా ఎన్జీటీ బృందమే సందర్శించాలని తెలంగాణ ఏఏజీ రామచంద్రరావు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. హెలికాప్టర్‌ సహా అన్ని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగానే వెళ్లాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పరిశీలన జరిపిన తర్వాత స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని