AP News: నామినేటెడ్‌ పదవికి రూ.5.5 కోట్లు?

నామినేటెడ్‌ పదవికి ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు రూ.5.5 కోట్లు తీసుకున్నారంటూ ప్రచారంలో ఉన్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Updated : 23 Feb 2024 16:19 IST

జడ్పీటీసీ సభ్యురాలి నుంచి తీసుకున్న ఎమ్మెల్యే?

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన లేఖ

చిత్తూరు, న్యూస్‌టుడే: నామినేటెడ్‌ పదవికి ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు రూ.5.5 కోట్లు తీసుకున్నారంటూ ప్రచారంలో ఉన్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి.సుచిత్ర సీఎం జగన్‌కు రాసినట్లుగా ఉన్న ఆ లేఖలో ఇలా ఉంది... ‘నాకు జడ్పీ వైస్‌ ఛైర్మన్‌, లేకుంటే రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్‌.. అదీ కాకుంటే వైకాపా కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు రూ.5.5 కోట్లు తీసుకున్నారు. నాకు పదవి ఇప్పించకపోవడంతో నగదు చెల్లించాలని పలుమార్లు కోరాను. బెంగళూరుకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి, అక్కడకు వెళ్లాక బెదిరించారు. మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేనని, దిక్కున్న చోట చెప్పుకోవాలని భయపెట్టారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మీరే (సీఎం జగన్‌) స్పందించి మాకు న్యాయం చేయాలి’ అని ఆ లేఖలో ఉంది.

తప్పుడు ఆరోపణలు: ఎమ్మెల్యే

ఈ విషయమై ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అంతా దేవుడే చూసుకుంటారని అన్నారు. లేఖపై వివరణ కోరడానికి ‘న్యూస్‌టుడే’ ప్రయత్నించగా జడ్పీటీసీ సభ్యురాలు ఎలాంటి సమాధానం చెప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని