Ts News: కొవిడ్‌ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో రద్దయిన నుమాయిష్‌

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ఈ సంవత్సరం పూర్తిగా రద్దయింది. ఈ నెల 1వ తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ నుమాయిష్‌ను ప్రారంభించిన విషయం

Published : 07 Jan 2022 01:31 IST

హైదరాబాద్‌: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ఈ సంవత్సరం పూర్తిగా రద్దయింది. ఈ నెల 1వ తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ నుమాయిష్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సంవత్సరం నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎగ్జిబిషన్‌ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. కొవిడ్ వ్యాప్తి వల్ల నుమాయిష్‌ను మూసివేయాలని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సొసైటీకి సూచించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. తాజాగా పోలీసులు సైతం నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎగ్జిబిషన్‌ను మూసివేస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది.

నుమాయిష్ రద్దు కావడంతో దుకాణాల యజమానుల నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలిపింది. తమ డబ్బులు ఇవ్వకపోయినా అభ్యంతరం లేదని.. వచ్చే ఏడాది నుమాయిష్‌కి తిరిగి దుకాణాలు పెట్టుకుంటామని కొంత మంది దుకాణాల యజమానులు కోరారని పేర్కొంది. వారి విజ్ఞప్తి మేరకు వచ్చే నుమాయిష్‌లో దుకాణం ఏర్పాటుకు వారికి అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అదే విధంగా వారం రోజుల పాటు మైదానంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ టీకా సెంటర్‌తో పాటు లయన్స్ క్లబ్ సహకారంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని