TS News: ఆ కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపేసి నేటికి ఏడాది

మండలంలోని కమలాపురం బిల్టు కర్మాగారం, కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపి నేటికి సంవత్సరమైంది. గత ఏడాది సెప్టెంబరు 22న యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని ఎన్పీడీసీఎల్‌ అధికారులు కర్మాగారం...

Updated : 22 Sep 2021 11:26 IST
ఛార్జింగ్‌ లైట్‌ సహాయంతో వంట చేస్తున్న మహిళ

కమలాపురం(మంగపేట), న్యూస్‌టుడే: ములుగు జిల్లా కమలాపురం మండలంలోని బిల్టు కర్మాగారం, కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపి నేటికి సంవత్సరమైంది. గత ఏడాది సెప్టెంబరు 22న యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని ఎన్పీడీసీఎల్‌ అధికారులు కర్మాగారం, కాలనీలో సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి కార్మిక కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. సరఫరా పునరుద్ధరిస్తే తామే కరెంట్‌ బిల్లులు కట్టుకుంటామన్నప్పటికీ అధికారులు వినకపోవడంతో అంధకారంలో ఇక్కట్లు పడాల్సి వస్తోంది. కొంతమంది చీకట్లో ఉండలేక గ్రామంలోకి వెళ్లి అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. మరి కొంత మంది గ్రామంలో లైట్లను ఛార్జింగ్‌ పెట్టుకొని వచ్చి ఆ వెలుతురులోనే వంటావార్పు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.కమలాపురం స్వర్ణయుగం అనుకున్న కార్మికులు కష్టాల కడలిలో మగ్గుతున్నారు. పూలమ్మినచోటే కట్టెలమ్మే పరిస్థితులు తలెత్తాయి. నాడు బిల్టు ఉద్యోగులమని చెప్పుకునే కార్మికులు నేడు దినసరి, వలస కూలీలుగా మారారు. పనుల కోసం వెతుక్కుంటున్నారు. పిల్లల చదువులు ప్రశ్నార్ధకంగా మారాయి. పూట గడవటమే కష్టతరంగా మారింది. ఏడున్నరేళ్లుగా కర్మాగారం పునఃప్రారంభం కాక, 73 నెలలుగా వేతనాలు రాక సతమతమవుతున్న కార్మికులకు విద్యుత్‌ కోత పుండు మీద కారం చల్లినట్లైంది. అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. నేడో రేపో కంపెనీ పునఃప్రారంభమవుతుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

దీపాల వెలుగులో వంటావార్పు

సంవత్సర కాలంగా చేతి, ఛార్జింగ్‌ దీపాలతోనే మహిళలు వంటా వార్పు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం సమయంలో కమలాపురం గ్రామంలో తెలిసిన వారి వద్దకు వెళ్లి ఛార్జింగ్‌ పెట్టుకొని రాత్రి వేళల్లో వంటలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో విషపురుగులు ఇళ్లలోకి రావడంతో పాటు ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్నారు. యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి బిల్టు కరపెనీని పునరుద్ధరించి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కార్మికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని