Children Vaccine: రేపట్నుంచే పిల్లలకు టీకా.. 6 లక్షల మంది రిజిస్ట్రేషన్‌

దేశవ్యాప్తంగా 15 నుంచి 18ఏళ్ల వయసు పిల్లలకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం వరకు 6లక్షల 35వేల మంది యుక్త వయసు పిల్లలు కొవిన్‌ (CoWIN) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 02 Jan 2022 23:06 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం వరకు 6 లక్షల 35 వేల మంది యుక్త వయసు పిల్లలు కొవిన్‌ (CoWIN) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పిల్లల వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు జనవరి 1 నుంచి కొవిన్‌ పోర్టల్‌లో సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే పిల్లల వ్యాక్సినేషన్‌ను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది సన్నద్ధతపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతానికి పిల్లలకు కొవాగ్జిన్‌ టీకాను పంపిణీ చేయనున్నందున వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ లేకుండా జాగ్రత్త పడాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పిల్లల వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి డిసెంబర్‌ 27న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని సూచించారు.

ఇక గతంలో పెద్దల కోసం కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో.. పిల్లలకు కూడా అలాగే చేసుకోవాలి. అయితే కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబరుతో లాగిన్‌ అయి నమోదు చేసుకోవచ్చు లేదా సెపరేట్‌గా కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉంది. లేదంటే సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే వాక్‌-ఇన్‌ రిజిస్ట్రేషన్‌ రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చిన్నారుల ‘కొవాగ్జిన్‌’ టీకాను 12ఏళ్ల వయసు పైబడిన వారికి ఇచ్చేందుకు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. ఈ టీకా సురక్షితమని తేలడంతో పాటు కొవిడ్‌ను నిరోధించడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లోనూ వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని