kakinada: కొత్త జంటను అడ్డుకున్న యువతి తల్లిదండ్రులు.. చివరికి ఏం జరిగిందంటే..?

గారాబంగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువతి.. కాకినాడకు

Updated : 27 Aug 2021 21:06 IST

గాంధీనగర్: గారాబంగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువతి.. కాకినాడ యువకుడిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రేమవివాహం చేసుకున్న ఆ జంటను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులను పక్కకు తప్పించి ఆ యువతిని ఓ సినిమా రేంజ్‌లో అక్కడి నుంచి తీసుకెళ్లాడు ఆ యువకుడు. ఈ ఘటన కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకుడు, కాకినాడకు చెందిన యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు 40 రోజుల క్రితం వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శుక్రవారం వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని.. ఆమెను తమతో రావాలంటూ బ్రతిమిలాడారు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన యువకుడు యువతిని కార్యాలయం గేటు బయటకు తీసుకువచ్చాడు. అప్పటికే అక్కడ కారుతో అతడి స్నేహితులు సిద్ధంగా ఉన్నారు. యువతిని కారులోకి ఎక్కించి, తానూ కదులుతున్న వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న యువతి తల్లిదండ్రులు కారును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. ‘నవమాసాలు మోసి పెంచాను. నీకేది కావాలంటే అది ఇచ్చాం. అవన్నీ మరచిపోయి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా’ అంటూ ఆ యువతి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. యువకుడి కంటే యువతి వయసులో ఒక సంవత్సరం పెద్దది కావడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని