Ap cabinet: పేదలకు ఇచ్చిన ఇళ్ల రుణాలకు వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం‌: పేర్ని నాని

విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమను

Updated : 16 Sep 2021 16:54 IST

అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతి ఇచ్చింది. మైనార్టీ సబ్ ప్లాన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నియామకం చట్ట సవరణకు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకి’తో కలిసి సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటును ఆమోదించింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి 10 వేల మెగావాట్ల ప్లాంట్‌, వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగావాట్లు ప్రభుత్వం కేటాయించనుంది. యూనిట్‌కు రూ.2.49లకే సరఫరా చేసేలా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్‌అండ్‌బీ ఖాళీ స్థలాలు, భవనాలు ఆర్టీసీకి బదలాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

భేటీ అనంతరం కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ వద్ద కుదువపెట్టిన పత్రాలను ప్రైవేటు ఆస్తిగా మార్చుకొనేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు రుణాలు పొంది కట్టుకున్న ఇళ్ల ధ్రువపత్రాలు హౌసింగ్‌ కార్పొరేషన్ వద్దే ఉన్నాయన్నారు. ఇలా రాష్ట్రంలో 46,67,301 మంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా రుణ విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు చెల్లించి ధ్రువపత్రాలు పొందాలని వెల్లడించారు. తనఖాలో ఉన్న ఇల్లు కొనుకున్న వారు పేదవాళ్లైతే వారికి కూడా వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం వర్తి్స్తుందని మంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్‌ 30వ తేదీలోగా చెల్లింపులు చేసిన వారికి రిజిస్టర్ చేసి ఇస్తామన్నారు. గత  ప్రభుత్వం నిర్ణయం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో ఛార్జీలు విధించాల్సి వస్తుందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని