
Ap News: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరద పరిస్థితులపై ఆరా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఆరా తీశారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల పరిస్థితిపై ప్రధానికి సీఎం వివరించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితిపై జగన్ వివరించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను వివరించారు. సహాయ చర్యలకు నేవీ హెలికాప్టర్లు వాడుకుంటున్నట్లు చెప్పారు. వరద సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే..
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకోనున్న సీఎం.. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ఇతర ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.