Amaravati News: రాజధాని ప్రాంతంలో ఆంక్షలు.. బయటవారికి నో ఎంట్రీ

రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

Updated : 08 Aug 2021 11:40 IST

అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులు చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి ప్రాంతంలో ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. పెదపరిమి వద్దే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు. మీడియాకు పోలీసులు సహకరించాలని ఎస్పీ విశాల్‌ గున్నీ కోరారు.

మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు.  పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు తెదేపా కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అమరావతి రైతులు ర్యాలీగా వస్తారన్న సమాచారంతో ఆలయం చుట్టు పక్కల ఇనుప కంచె వేసి సమీపంలోకి ఎవరినీ రానివ్వడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని