Vaccinated Pregnant Women: తల్లుల నుంచి బిడ్డలకు అధిక స్థాయిలో యాంటీబాడీలు..!

ఏ జంకూ లేకుండా గర్భిణీలు కరోనా టీకా పొందొచ్చని, వారి నుంచి అధిక సంఖ్యలో యాంటీబాడీలు బిడ్డలకు వెళ్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు పొందిన వారిపై ఈ అధ్యయనం ..

Published : 23 Sep 2021 14:51 IST

గర్భిణీలు కరోనా టీకా పొందితే మేలన్న తాజా అధ్యయనం 

వాషింగ్టన్‌: ఏ జంకూ లేకుండా గర్భిణీలు కరోనా టీకా పొందొచ్చని, వారి నుంచి అధిక సంఖ్యలో యాంటీబాడీలు బిడ్డలకు వెళ్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు పొందిన వారిపై ఈ అధ్యయనం సాగినట్లు పరిశోధకులు చెప్పారు. అందుకోసం బొడ్డుతాడు రక్తం (అంబిలికల్ కార్డ్ బ్లడ్‌)లో ఉన్న యాంటీబాడీల స్థాయిలను పరిశీలించారు. అవి వైరస్ సంక్రమణ వల్ల వచ్చాయా లేక టీకా వల్ల వచ్చినవా అనే విషయాన్ని గమనించారు. అమెరికా జర్నల్‌లో ప్రచురితమైన ఈ తరహా తొలి పరిశోధన ఇదే. కాగా, 36 మంది నవజాత శిశువులు కొవిడ్ ప్రతిరోధకాలను కలిగి ఉన్నారని, వారి తల్లులు ఫైజర్ లేక మోడెర్నా టీకా వేయించుకున్నారని చెప్పారు. 

ఈ సమాచారం గర్భిణీలు టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న అమెరికా ప్రసూతి వైద్యురాలు ఆశ్లే రోమన్ అన్నారు. అలాగే వారు టీకా తీసుకోవాలని తాము సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. గర్భిణీలకు టీకాలు సురక్షితమనే ఆధారాలు లభిస్తున్నప్పటికీ.. 18 నుంచి 49 ఏళ్ల మధ్యలో ఉన్న 30 శాతం మంది గర్భిణీలు మాత్రమే వాటిని వేయించుకున్నట్లు సీడీసీ తాజాగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. మరిన్ని వివరాలు పొందేందుకు ఈ అధ్యయనాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే బిడ్డ జన్మించిన తర్వాత ఆ యాంటీ బాడీలు ఎంతకాలం ఉంటాయో గుర్తించనున్నారు. 

అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ కూడా మామి-వ్యాక్స్ పేరిట ఇదే తరహా అధ్యయనాన్ని ప్రారంభించింది. మావి (ప్లాసెంటా), తల్లిపాల ద్వారా టీకా యాంటీ బాడీలు ఏ స్థాయిలో బిడ్డకు బదిలీకానున్నాయో కూడా అంచనా వేయనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని