AP News: తిరుమలలో జల విలయం.. వాగులను తలపిస్తున్న కనుమదారులు

తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరదనీరు ప్రహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భీతావహంగా మారాయి. కనుమదారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఘాట్‌ రోడ్డులో విరిగి పడుతున్న చెట్లు, కొండ చరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సెల్లార్‌లోకి వరదనీరు చేరింది. ...

Published : 19 Nov 2021 01:47 IST

తిరుమల: తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరదనీరు ప్రహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భీతావహంగా మారాయి. కనుమదారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఘాట్‌ రోడ్డులో విరిగి పడుతున్న చెట్లు, కొండ చరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సెల్లార్‌లోకి వరదనీరు చేరింది. 

మధ్యాహ్నం వరకు ఓ మాదిరిగా పడిన వాన .. ఆ తరువాత కుండపోతగా కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదనీటి ప్రవాహం భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయంలోకి వస్తున్న నీటిని అగ్నిమాపక సిబ్బంది మోటార్ల ద్వారా తోడుతున్నారు. తిరుమాడ వీధులు, రహదారులు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మరో వైపు మొబైల్‌ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఎక్కడ ఏం జరుగుతోందో తెలియని  పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతంలోని వరదనీరు నడకమార్గంలో మెట్లపై ప్రవహిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం జలపాతాలను తలపిస్తున్నాయి. ముందస్తు భద్రతాచర్యలతో నడక మార్గాలను మూసేయడంతో ప్రమాదం తప్పింది. రోడ్లపై ప్రవహించే నీరు వాగులు, వంకలను తలపించింది. ఉదయం హరిణి ప్రాంతంలో రోడ్డుపై పెద్ద బండరాళ్లు పడగా వాటిని తొలగించారు. మధ్యాహ్నం తరువాత కురిసిన వానతో ఘాట్‌రోడ్లలో అనేక ప్రాంతాల్లో కొండచరియలు పడ్డాయి. చెట్లు, మట్టి రహదారిపైకి కొట్టుకు రావడంతో ఘాట్‌రోడ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తిరుమల రాలేని భక్తులకు మరో అవకాశం: తితిదే
వర్షాలు తగ్గాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం వల్ల తిరుమల వెళ్లలేని భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో బస ఏర్పాటు చేశారు. వర్షాలతో తిరుమల రాలేని భక్తుల దర్శనానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు తితిదే ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి దర్శన టికెట్లు ఉంటే తర్వాత దర్శనానికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని