GHMC: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వ్యక్తి గల్లంతు

నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌,

Updated : 25 Sep 2021 23:57 IST

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్‌పూర, ఫలక్‌నామాలో భారీ వర్షం కురిసింది.  నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.  సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్‌ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో ఇరు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భారీ వర్షానికి కింగ్‌కోఠి ఆసుపత్రి వద్ద ఓ వృక్షం నేలకొరిగింది. భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌ స్తంభించిది. ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్‌ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు.

వర్షం కారణంగా రాయదుర్గం వద్ద రాకపోకలు స్తంభించాయి. మల్కం చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ మార్గంలో వాహనాలను నార్సింగ్‌ వైపు మళ్లించారు. మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ సమీపంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాలినడకన వెళ్తున్న వ్యక్తి డ్రైనేజీ పైప్‌లైన్‌ కోసం తవ్విన గుంతలో పడ్డాడు. వర్షపు నీటితో నాలా నిండడంతో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని