GHMC: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం...అత్యవసరమైతేనే బయటకు రండి

వాతావరణ శాఖ ప్రకటించిన విధంగానే హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, సరూర్‌నగర్‌, చంపాపేట, సైదాబాద్‌, చైత్యనపురి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌,

Updated : 09 Oct 2021 20:46 IST

హైదరాబాద్‌: వాతావరణ శాఖ ప్రకటించిన విధంగానే హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, సరూర్‌నగర్‌, చంపాపేట, సైదాబాద్‌, బేగంబజార్‌, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, ఆల్వాల్‌, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ధూల్‌పేట, పురాన్‌పూల్‌, జియాగూడ, చైత్యనపురి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. రహదారులపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మలక్‌పేట, ఖైరతాబాద్‌, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి ట్రాఫిక్‌ స్తంభించింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం కురవడం నగరవాసులను కలవరపెడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. సహాయం కోసం కంట్రోల్‌ రూంను సంప్రదించవచ్చని వివరించింది. కంట్రోల్‌ రూం నెంబర్‌ 040 2111 1111ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈరోజు ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పారు. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి రానున్న 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని