HYD: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

నగరంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ వర్షం పడడంతో ప్రజలు 

Updated : 16 Oct 2021 17:38 IST

హైదరాబాద్‌: ఉత్తరకోస్తాంధ్ర- పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వానకు రహదారులు జలమయమయ్యాయి. అంబర్ పేటలో భారీగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఓయూ పరిధిలోని మోహినీ చెరువు నుంచి వస్తున్న వరద తాకిడికి అంబర్‌ పేట, పటేల్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌ కాలనీలోని పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, నాంపల్లి, కోఠి, లంగర్‌హౌస్‌, గోల్కొండ, మెహదీపట్నం, రాజేంద్రనగర్‌లో భారీ వర్షం కురిసింది. గండిపేట, బండ్లగూడ, శంషాబాద్‌, రాయదుర్గం, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌ నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, తుర్కయాంజాల్‌, మీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం ధాటికి రోడ్లపై భారీగా నీరు చేరింది. పనామా కూడలి వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.  డ్రైనేజిలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రామంతాపూర్‌, ఉప్పల్‌, చిలుకానగర్‌, హబ్సిగూడలో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. హబ్సిగూడ డివిజన్‌లోని పాశం సత్తయ్య కాలనీలో గుంతలో పడిపోయిన ద్విచక్రవాహన దారుడిని స్థానికులు రక్షించారు. తాగునీటి పైప్‌లైన్‌ మరమ్మతుల పేరిట గుంత తవ్వేసి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మేయర్‌
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న మాన్‌సూన్‌ బృందాలు తమ పరిధిలో నిలిచిపోయిన వరదనీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు వస్తే  జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ 040-21111111కు ఫిర్యాదు చేయాలని నగరవాసులకు సూచించారు. కంట్రోల్‌ రూమ్‌లో అధికారులు అందుబాటులో ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో కోఆర్డినేట్‌ చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు