AP News: ఏపీలో మళ్లీ వాన... కడప జిల్లాలో పాఠశాలలకు సెలవు

ఇటీవల కురిసన వర్షాల నుంచి జనం ఇంకా తేరుకోక ముందే మళ్లీ వానలు కురుస్తున్నాయి.

Updated : 28 Nov 2021 21:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల కురిసన వర్షాల నుంచి జనం ఇంకా తేరుకోక ముందే మళ్లీ వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వరదల దృష్ట్యా కడప జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వర్షాల కారణంగా అనేక చోట్ల రాకపోకలు స్తంభించాయి. చిట్వేలు మండలంలో ఎల్లమరాజు చెరువు నిండి అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాపూరు-నెల్లూరు వైపు వెళ్లే వాహనాలకు అంతరాయమేర్పడింది. గుంజనఏరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బాలపల్లికి శేషాచలం అడవుల నుంచి వరద భారీగా వస్తోంది. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే కోడూరు పట్టణంలోని నరసరాంపేటలో కోతకుగురై రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదాన్ని గమనించి ముందే ఇల్లు ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవకర్గంలో భారీ వర్షాలకు పెన్నా, అహోబిలం రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండ్రోజుల పాటు వానలు పడతాయన్న హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టారు. ఉరవకొండ, కూడేరుకు చెందిన అధికారులు డ్యామ్‌ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్యామ్‌ చరిత్రలో మొట్టమొదటి సారి గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

నాయుడుపేటలో కుండపోత వర్షం..

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఆత్మకూరులో రహదారులపై వర్షం నీరు నిలిచింది. 14వ వార్డులో పాతబస్టాండ్‌ వద్ద కాలువ పొంగింది. పెరారెడ్డి బీసీ కాలనీలోకి వరదనీరు చేరడంతో స్థానికులు భయాందోలనకు గురయ్యారు. అధికారులు వరదనీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. అనంతసాగరం, ఏఎస్‌పేట, సంగం, మరిపాడు, చేజర్ల మండలాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగుతున్నాయి. కొన్ని చోట్ల గండ్లు కొట్టి చెరువుల నుంచి నీరు వదిలారు. నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై అక్కడక్కడ వరద పారుతోంది.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, చినగంజాం, పర్చూరులో వర్షం కురిసింది. చీరాలలో వీధులన్నీ జలమయమయ్యాయి. ఒంగోలులో జోరు వానకు లోతట్టు ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షానికి  కోసిన వరి పంట నీటమునిగింది. పంటను కాపాడుకునేందుకు రైతులు కుప్పలు వేసుకుంటున్నారు.

29న అల్పపీడనం ఏర్పడే అవకాశం..
దక్షిణ అండమాన్‌ సముద్రంలో 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. మరోవైపు శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో... రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం నుంచి రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని సూచించారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో... ‘‘తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. డిసెంబరు 1వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి’’ అని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని