Ts News: తెలంగాణలో ధాన్యం సేకరణలో తెరాస వైఖరి సరిగా లేదు: టికాయత్‌

సాగు చట్టాల రద్దు అంశం పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నగరంలో రైతు సంఘాల నేతృత్వంలో మహాధర్నా సాగుతోంది. దిల్లీలో రైతు ఉద్యమం

Updated : 25 Nov 2021 16:00 IST

హైదరాబాద్‌: సాగు చట్టాల రద్దు అంశం పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నగరంలో రైతు సంఘాల నేతృత్వంలో మహాధర్నా సాగుతోంది. దిల్లీలో రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఇందిరాపార్కు వద్ద ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో మహాధర్నా ప్రారంభమైంది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేత రాకేష్‌ టికాయత్‌, ఏఐకేఎస్ నేతలు అతుల్‌కుమార్ అంజన్‌, హన్నన్ మెల్లా, భూమి బచావో ఆందోళన్ నేత జాగ్తర్ బజ్వా, ఆశిష్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పోడు రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాగు చట్టాల రద్దు ఆహ్వానిస్తూ విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో రద్దు చేసి ఆమోదించాలని కిసాన్ నేతలు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం ప్రవేశపెట్టాని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రంలో పోడు భూములకు పట్టాల పంపిణీ, ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌కేఎం నేత రాకేష్‌ టికాయత్‌ మాట్లాడుతూ.. ‘‘మన అందరి భాష వేరైనా భావన ఒక్కటే. సాగు చట్టాల రద్దు కోమమే మా పోరాటం కాదు. మోదీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో మోదీ సర్కారు కొనసాగుతోంది. అదానీ, అంబానీల ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోంది. దిల్లీలో ఏడాది పాటు ఉద్యమం చేయడం ఇదే తొలిసారి. కార్పొరేట్‌ లబ్ధికి మోదీ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. సాగు చట్టాల రద్దుపై మాకు అనేక సందేహాలు ఉన్నాయి. భాజపాకు ఎవరూ ఓటు వేయకూడదు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. కనీస మద్దతు ధరల చట్టం తీసుకుకావాలి. రైతుల సమస్యలు పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలి. విద్యుత్‌ సవరణ బిల్లుపై ప్రధాని సమాధానం చెప్పాలి. విత్తన బిల్లు తేకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ము కాస్తున్నారు. మా డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళ్లిపోతాం. ఒకవేళ డిమాండ్లకు ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి..

రైతు ఉద్యమంపై తెరాస ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలి. తెలంగాణలో ధాన్యం సేకరణలో తెరాస వైఖరి సరిగా లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు ఉద్యమంలో సీఎం కేసీఆర్‌, తెరాస కదిలిరావాలి’’ అని టికాయత్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని