
Ap News: రాయలచెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం!
దండోరా వేయించి ప్రజల్ని అప్రమత్తంచేసిన అధికారులు
చిత్తూరు: తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెరువు దిగువ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు దండోరా వేయించారు. మొరవ నుంచి నీరు వెలుపలికి పంపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రాయలచెరువు వద్దకు వచ్చిన ఆర్డీవో రేణుక అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాయల చెరువు నీటి సామర్థ్యం తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చెరువు తెగితే వంద గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. చిత్తూరు జిల్లాలో అతి పెద్ద చెరువుల్లో రాయలచెరువు కూడా ఒకటి. దీని కింద వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం రాయలచెరువుకు పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కట్ట బలహీనంగా ఉండటంతో ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న అధికారులు.. చెరువు కింది భాగంలో ఉన్న వందలాది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలంటూ దండోరా వేయించారు.