Viveka Murder Case: సమాచారం అందిస్తే రూ.5లక్షల రివార్డు: సీబీఐ 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటించింది.

Updated : 21 Aug 2021 13:48 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక ప్రకటన చేసింది. కేసుకు సంబంధించి సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఇస్తే రూ.5లక్షలు అందజేస్తామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ అధికారులు వెల్లడించారు. వారు ఫోన్‌ నంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో గానీ తమను సంప్రదించవచ్చని తెలిపారు.

దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలు ప్రశ్నించింది. మూడు నెలల కిందట నాలుగో దఫా విచారణ చేపట్టిన సీబీఐ.. వరుసగా 76 రోజుల నుంచి విచారణ జరుపుతోంది. ఈ హత్య కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున.. నమ్మకమైన సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని సేకరించేందుకు సీబీఐ ఈ ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు 76వ రోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ విచారణకు వివేకా ఇంట్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన ఇదాయతుల్లా హాజరయ్యారు. హత్య జరిగిన రోజు ముందుగా వివేకా మృతదేహానికి ఇదాయతుల్లానే ఫొటోలు తీసినట్లు గుర్తించారు. అందులో భాగంగానే సీబీఐ అధికారులు అతడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన విజయ్‌ శంకర్‌రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని