
TS News : నూతన సంవత్సరం బహుమతిగా షేక్‌పేట పైవంతెన ప్రారంభం
హైదరాబాద్ : కొత్త సంవత్సరం బహుమతిగా షేక్‌పేట పైవంతెనను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్ఆర్డీపీ కార్యక్రమం కింద పెద్దఎత్తున రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. కంటోన్మెంట్లో మూసివేసిన రహదారులను తెరిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.
ఇక షేక్‌పేట పైవంతెన.. నగరంలోని పొడవైన పై వంతెనల్లో ఒకటి. హైటెక్ సిటీ ట్రాఫిక్ కష్టాలను ఎక్కువ శాతం తీర్చనుంది. టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడలి వరకు షేక్‌పేట నాలా రోడ్డుపై నిర్మాణమైంది. ప్రస్తుతం మెహిదీపట్నం, అత్తాపూర్‌ల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లాలంటే వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇరుకు కూడళ్లలో నిమిషాల తరబడి చిక్కుకుపోతున్నారు. పని వేళల్లో మరీ దారుణం. ఎందుకంటే.. మెహిదీపట్నం, అత్తాపూర్, దిల్సుఖ్నగర్, కోఠి, తదితర ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, ఐటీ కారిడార్, నానక్‌రామ్‌గూడ, బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్), లింగంపల్లికి వెళ్లేవారు ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు. గోల్కొండ, కుతుబ్షాహి టూంబ్స్కు వెళ్లేవారికీ ఇదే దారి. దీనివల్ల ఉద్యోగులు సమయానికి కార్యాలయానికి చేరుకోలేకపోవడం, కర్బన ఉద్గారాలతో కాలుష్యం పెరిగి ఐటీ కారిడార్ వాతావరణం దెబ్బతినేది. సమస్యలను పరిష్కరించేందుకు ఐటీ కారిడార్‌లో జీహెచ్ఎంసీ ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా వేర్వేరు పై వంతెనల నిర్మాణం చేపట్టింది.
వంతెన స్వరూపం ఇలా..
వ్యయం: రూ.333.55 కోట్లు
పొడవు: రూ.2.8కి.మీ
వెడల్పు: రూ.24 మీటర్లు (6లైన్లు)
పిల్లర్లు: 74