
Ts News: యాదాద్రి నారసింహునికి ‘మేఘా’ భారీ విరాళం
హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి 6 కిలోలు బంగారాన్ని బహూకరించనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించడం ఎంతో పుణ్య కార్యమని.. అందులో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే 6 కిలోల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో సంబంధిత అధికారులకు అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో యాదాద్రి పుణ్యక్షేత్రం మరింత అందంగా రూపుదిద్దుకొని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంఈఐఎల్ నిర్మించిందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని దర్శనీయ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతి గడించిందని వివరించారు.