Cm Jagan: కొవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.30వేల కోట్ల భారం: జగన్‌

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో

Published : 07 Dec 2021 19:04 IST

అమరావతి: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో యూనియన్‌ బ్యాంకు సీఈఓతో పాటు ఆర్‌బీఐ సహా పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. చాలా కీలక పరిస్థితుల్లో బ్యాంకర్ల సమావేశం జరుగుతోందన్న సీఎం.. కరోనా థర్డ్‌ వేవ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకపోతే ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా పుంజుకునేదన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ దేశ ఆర్థిక రంగంపై చాలా తక్కువ ప్రభావం చూపాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పరిమితి పెంపునకు సంబంధించి బ్యాంకర్లను గట్టిగా కోరలేమన్నారు. కొవిడ్‌ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయన్న ముఖ్యమంత్రి.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు.

ఓవైపు ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోగా, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందన్నారు. కొవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21 రూ.14వేల కోట్లు తగ్గిందన్నారు. కొవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ విధంగా కొవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30వేల కోట్ల భారం పడిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాకింగ్‌ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగిందన్నారు. కొవిడ్‌ సమయంలోనూ పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలను, నిరుపేదలను ఆదుకోగలిగిందన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు రూ.35వేల చొప్పున బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కోరారు. అవసరమైతే ఇళ్ల పట్టాలను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారుల నుంచి కేవలం 3శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని