PULIVENDULA: మా ప్రాణాలు కాపాడండి: వివేకా కుమార్తె సునీత

పులివెందులలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, కుటుంబానికి భద్రత కల్పించాలని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె సునీత జిల్లా ఎస్పీని కోరారు. ఈమేరకు కడప ఎస్పీ

Updated : 13 Aug 2021 16:44 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత .. కడప ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని లేఖలో కోరారు. ఈనెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికంఠరెడ్డి వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడిగా ఆమె వివరించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు.

మరో వైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 68వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం నాటి విచారణకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్‌ కార్యాలయంలో పనిచేసే రఘునాథరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు సంబంధించిన వివిధ అంశాలపై సీబీఐ అధికారులు వారిని ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని