KCR Delhi Tour: గెజిట్‌లోని అంశాల అమలుకు సహకరిస్తాం: సీఎం కేసీఆర్‌

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని ప్రాజెక్టుల పరిధి, ఇతర అంశాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి

Updated : 06 Sep 2021 22:00 IST

దిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని అంశాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సైతం భేటీలో పాల్గొన్నారు.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ వివరించారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పిటిషన్‌ విత్‌డ్రా పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. గెజిట్‌ అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని.. గెజిట్‌ అమలు ఇంత త్వరగా సాధ్యమవుతుందా పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. కొంత గడువు తర్వాత అమలుపైనా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా గోదావరిపై ప్రాజెక్టులన్నింటినీ షెకావత్‌కు సీఎం కేసీఆర్‌ వివరించారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరైనట్లు షెకావత్‌కు రజత్‌కుమార్‌ తెలిపారు. అజెండాలో పేర్కొన్న అంశాలపై చర్చించినట్లు వివరించారు. అంతకుముందు కేంద్ర రవాణా శాఖ మంత్రితో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. రహదారుల విస్తరణపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని